Mancherial: చెన్నూరులో రూ.15.50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి!

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రూ.15.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.

RAJENDER, CHENNUR
Published on: 26 Oct 2026 12:09 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరులో రూ.15.50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి!

Mancherial: చెన్నూరు పట్టణంలో పర్యటిస్తున్న రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపనలు చేసిన మంత్రి వివేక్.

చెన్నూరు పట్టణంలో అభివృద్ధి జాతర జరుగుతోందని మంత్రి వివేక్ అన్నారు చెన్నూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా మొత్తం రూ.15.50 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

చెన్నూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడిందని పట్టణంలో రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినట్టు తెలిపారు.

రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొత్తం రూ.15.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో చెన్నూరు పట్టణ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు.

చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి పెద్ద చెరువు వద్ద గల రావి చెట్టు వరకు రూ.5.50 కోట్లతో డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టనున్నారు. అలాగే మహంకాళి టెంపుల్ నుంచి జాతీయ రహదారి వరకు రూ.3.50 కోట్లతో సీసీ రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు.

ఇక జాతీయ రహదారి నుంచి పుష్కర ఘాట్ వరకు రూ.6.50 కోట్లతో సీసీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ మీడియన్, లైటింగ్ పనులు చేపట్టనున్నారు. పుష్కర ఘాట్ వద్ద హైమాస్ట్ లైట్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే చెన్నూరు పట్టణంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందుబాటులోకి రానుంది.

డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చెందడంతో ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయి. మొత్తంగా రూ.15.50 కోట్ల అభివృద్ధి పనులతో చెన్నూరు పట్టణ అభివృద్ధికి కొత్త ఊపునివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు మెరుగైన రహదారులు, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR