Mancherial: మంచిర్యాలలో రౌడీషీటర్ల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసుల దాడి!
Mancherial: మంచిర్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Mancherial: మంచిర్యాలలో రౌడీషీటర్ల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసుల దాడి!
Mancherial: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా మంచిర్యాల పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం అర్ధరాత్రి మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్‌నగర్‌లో రౌడీషీటర్ల ఇళ్లను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రౌడీషీటర్ల ప్రస్తుత పరిస్థితి, వారి కదలికలు, కార్యకలాపాలు, ప్రవర్తన తదితర అంశాలను పోలీసులు పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంతమైన జీవనం సాగించాలని సూచించారు.
సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్ల తొలగింపుపై పరిశీలన
ఈ సందర్భంగా డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. గొడవలు, బెదిరింపులు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు.
రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు వచ్చి, భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో కొనసాగితే నిబంధనల ప్రకారం వారి రౌడీషీట్ల తొలగింపు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అదే సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, గొడవలు, బెదిరింపులకు దిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిరంతరం పోలీసుల నిఘా
రౌడీషీటర్లు తిరిగి నేరాలకు పాల్పడినా, అసాంఘిక శక్తులతో సంబంధాలు కొనసాగించినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదని డీసీపీ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో నేరరహిత, ప్రశాంత వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తామని డీసీపీ తెలిపారు.




