Mancherial: సీతారాంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మేయర్ మధుకర్!
Mancherial: మంచిర్యాల సీతారాంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేయర్ దర్ని మధుకర్ ప్రారంభించారు.
Mancherial: సీతారాంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మేయర్ మధుకర్!
Mancherial: రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరోవైపు రానున్న వేసవిలో ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, నీటి లభ్యతపై కూడా ప్రభావం పడవచ్చని మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచనల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎల్నినో ప్రభావంతో సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండించే పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభదాయకమైన పంటలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, కార్పొరేటర్ రాచకొండ గోపాల్ రావు, పీడీ మెప్మా సుభాష్, టీఎంసీ, ఐకేపీ కేంద్రం ఇన్చార్జి వర్ష, వ్యవసాయ శాఖ ఏఈ మహేందర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లింగయ్య, దర్ని మల్లేష్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యాల కొమురయ్య, మాజీ సర్పంచ్ తెలేటి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ సీతారాంపల్లి ఇన్చార్జి కొక్కిరాల మోహన్ రావు, మాజీ వార్డు సభ్యుడు గౌస్, రైతులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




