Mancherial: మందమర్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: మంత్రి వివేక్
Mancherial: మందమర్రిలో సింగరేణి స్థలాల్లో 1,000 ఇందిరమ్మ ఇళ్లు, రూ.7 కోట్లతో పబ్లిక్ స్కూల్, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గడ్డం వివేకానంద వెల్లడించారు.
Mancherial: మందమర్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: మంత్రి వివేక్
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇళ్ల నుంచి విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల వరకు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా భారీ ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యంగా సొంత ఇళ్లు లేని నిరుపేదల కోసం సింగరేణి భూములను సేకరించి సుమారు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మరోవైపు రూ.7 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, 50 పడకల ఆసుపత్రి, రూ.30 కోట్లతో తాగునీటి పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాలను రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద వెల్లడించారు.
శుక్రవారం మందమర్రిలోని బి-1 క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి 68 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులకు ఆలస్యం లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన చెక్కులను రెండు రోజుల్లోగా లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.
సింగరేణి భూముల్లో వెయ్యి ఇళ్లు
మందమర్రి ప్రాంతం ఏజెన్సీ స్వభావం కలిగి ఉండటంతో భూముల లభ్యత సమస్యగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి సీఎండీతో చర్చించి సంస్థకు చెందిన భూములను సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు వెయ్యి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, రానున్న రెండేళ్లలో మరో రెండు లక్షల ఇళ్లను నిర్మించడంతో ఐదేళ్లలో మొత్తం నాలుగు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు.
విద్య, వైద్యానికి పెద్దపీట
మందమర్రిలో రూ.7 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని, విద్య, వసతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒకే ప్రాంగణంలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఈ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
మందమర్రిలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించామని, వచ్చే ఏడాది మార్చిలోగా మంజూరు పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు. నిర్మాణ పనులు ప్రారంభించి స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
మౌలిక వసతుల అభివృద్ధికి రూ.30 కోట్లు
మందమర్రి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి పనులు చేపట్టామని, మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు సుమారు రూ.30 కోట్లతో ఇందిరా వాటర్ స్కీమ్, అమృత్ పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
యువతకు స్థానికంగానే ఉపాధి
మందమర్రి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త మైన్ ఏర్పాటుతో పాటు ఏటీసీ శిక్షణ కేంద్రం ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జర్మన్ భాషలోనూ శిక్షణ కల్పించి విదేశాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీరు, విద్యుత్ వినియోగంలో ప్రజలు పొదుపు పాటించాలని సూచించారు. రైతులు నీటి లభ్యతను బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని, అధిక నీరు అవసరమయ్యే వరి సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం సుమారు రూ.38 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించగా, ఇప్పటివరకు రూ.11 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని వివరించారు.
జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్ వెల్లడి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కోటపల్లి మండలంలో నూతన ఎస్సీ వసతి గృహం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి రూ.1.60 కోట్లతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
రామకృష్ణాపూర్లో సింగరేణి సహకారంతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మందమర్రి, భీమారం, జైపూర్ మండలాల్లో విద్యార్థుల నమోదు శాతం 10 శాతానికి పైగా పెరిగిందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. అమృత్ పథకం కింద మందమర్రిలో తాగునీటి పైప్‌లైన్ పనులు, క్యాతనపల్లిలో రెండు నీటి ట్యాంకులు, పైప్లైన్లు, చెన్నూరులో మూడు నీటి ట్యాంకుల నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు.
కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.




