Mancherial: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం!
Mancherial: మంచిర్యాల పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Mancherial: ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం!
మంచిర్యాల, నవంబర్ 17: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ప్రయాణికుల భద్రతలో ఆటో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్ అన్నారు. రోడ్లపై ఆటోలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మంచిర్యాల పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే ఆటోలను పార్కింగ్ చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి ఆటో డ్రైవర్ వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్లు కేవలం ప్రయాణికులను చేరవేసే వారిగానే కాకుండా, సమాజంలో బాధ్యతాయుతమైన భాగస్వాములుగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎంవీఐ సూర్యతేజ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ, సేఫ్ జర్నీ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ చిల్వేరు శ్రీనివాస్, మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.




