Mancherial: బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై కఠిన చర్యలు

Mancherial: మంచిర్యాలలో బియ్యం అక్రమ నిల్వలు, నల్లబజారు రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ వి.రాములు హెచ్చరించారు. స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Oct 2026 6:26 PM IST
Mancherial
X

Mancherial: బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై కఠిన చర్యలు

మంచిర్యాల: జిల్లాలో బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణాకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి అదనపు కలెక్టర్ సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, బియ్యం వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు, కిరాణా వర్తకులతో బియ్యం నిల్వలు, ధరల నియంత్రణ, మార్కెట్ పరిస్థితులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం నిల్వలు, సరఫరా, ధరల విషయంలో వ్యాపారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం, అక్రమంగా నిల్వలు ఉంచడం, అధిక ధరలకు విక్రయించడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.

ప్రతి వ్యాపారి తమ వద్ద అందుబాటులో ఉన్న బియ్యం నిల్వల వివరాలను రోజువారీగా స్టాక్ బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని, విక్రయ ధరలను కూడా వినియోగదారులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిత్యావసర వస్తువుల చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా వ్యాపారులు అధికారులకు సహకరించాలని, మార్కెట్‌లో అనవసర ధరల పెరుగుదల, అక్రమ నిల్వలు చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో డీహెచ్‌ఓ, డీఎంఓ, డీటీసీఎస్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.