Mancherial: కళ్లకు నల్లగంతలతో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన!
Mancherial: సింగరేణి లాభాల్లో విశ్రాంత ఉద్యోగులకు వాటా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలో కళ్లకు నల్లగంతలు కట్టుకుని తెలంగాణ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నిరసన తెలిపింది.
Mancherial: కళ్లకు నల్లగంతలతో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన!
మంచిర్యాల: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో విశ్రాంత ఉద్యోగులకు వాటా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంఘం నాయకులు కళ్లకు నల్లగంతలు కట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం 30 నుంచి 35 ఏళ్లపాటు బొగ్గు గనుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసిన కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న సంస్థను వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకురావడంలో కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సైతం లాభాల్లో వాటా ప్రకటిస్తారని ఆశించిన విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం రూ.350 నుంచి రూ.1,000లోపు కోల్ మైన్స్ పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ల కంటే తక్కువ మొత్తంలో పెన్షన్ పొందుతున్న వారికి లాభాల్లో వాటా ప్రకటిస్తే పండుగలను కుటుంబాలతో సంతోషంగా జరుపుకునే అవకాశం ఉండేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వారి ఆశలను నెరవేర్చలేదని విమర్శించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్రాంత ఉద్యోగులకు వ్యతిరేక విధానాలు అమలు చేసినందునే ఆ ప్రభుత్వాన్ని ఓడించడంలో సింగరేణి పరిధిలోని సుమారు 80 వేల విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించకూడదని, ఇప్పటికైనా విశ్రాంత ఉద్యోగులకు సంస్థ లాభాల్లో వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అలాగే, గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి CPRMS ఆరోగ్య కార్డు వైద్య పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. అధికారులకు కల్పిస్తున్న విధంగా విశ్రాంత ఉద్యోగులకు కూడా రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చుల సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సొంత ఇళ్లు లేని విశ్రాంత ఉద్యోగులకు నెహ్రూ హౌసింగ్ కాలనీల్లో ఇళ్లు కేటాయించాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను వారికి కేటాయించాలని, ఏరియా ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి సంక్షేమానికి వ్యతిరేకంగా విధానాలు అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు భీంసేన్, భిక్షపతి, రాజేశం, నర్సయ్య, నారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.




