Mancherial: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర నాకాబందీ!
Mancherial: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల ముమ్మర నాకాబందీ ఎన్‌హెచ్-63 పై అక్రమ రవాణాకు చెక్ మంచిర్యాల జిల్లా చెన్నూర్ పరిధిలోని 8 కీలక కేంద్రాల్లో విస్తృత తనిఖీలు.
Mancherial: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర నాకాబందీ!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్ లోని చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం, వేమనపల్లి మండలాల్లో విస్తృతస్థాయిలో నాకాబంది కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు. సరిహద్దుల్లో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ డివిజన్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర నాకాబందీ, ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించారు.
ముఖ్యంగా, తెలంగాణ- మహారాష్ట్ర- చత్తీస్గడ్ రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారి 63 పై పోలీసులు భారీ స్థాయిలో నాకాబందీ ఏర్పాటు చేశారు. చెన్నూర్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న 8 అత్యంత కీలక ప్రాంతాలలో పోలీసు బలగాలు వాహనాలను జల్లెడ పడుతున్నాయి.
జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న ప్రతి వాహనాన్ని నిలిపివేసి క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానంగా అనిపించిన వాహనదారులు, ప్రయాణికుల వివరాలను సేకరించి, సమగ్రంగా విచారించిన అనంతరమే ముందుకు వెళ్లేందుకు అనుమతినిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి జిల్లాలోకి జరిగే అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సరిహద్దుల ద్వారా అక్రమంగా తరలిస్తున్న వరి ధాన్యం, పి.డి.ఎస్ (రేషన్) బియ్యం, గంజాయి, మద్యం, ఇసుక, పశువుల రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించిన, లేదా ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు కనిపిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు, వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. అక్రమ వ్యాపారాలు, అక్రమ రవాణాలపై పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.




