Mancherial: మంచిర్యాలలో పోలీసుల నాకాబందీ.. బ్యాంకులు, షాపుల్లో తనిఖీలు!

Mancherial: నేరాల నియంత్రణే లక్ష్యం మంచిర్యాలలో పోలీసుల విస్తృత నాకాబందీ బ్యాంకులు, గోల్డ్ షాపులు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు డీసీపీ భాస్కర్.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 3 Oct 2026 6:49 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో పోలీసుల నాకాబందీ.. బ్యాంకులు, షాపుల్లో తనిఖీలు!

మంచిర్యాల, అక్టోబర్‌ 3: నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘాను మరింత పెంచేందుకు మంచిర్యాల పట్టణంలో పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో మార్కెట్‌ ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు, లాడ్జీలు, బ్యాంకులు, గోల్డ్‌ షాపులు, ప్రధాన రహదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌ ఆధ్వర్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించారు. ముఖ్యంగా బ్యాంకులు, బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని జరిగే చోరీలు, దోపిడీలు, బర్గలరీలను ముందుగానే అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా కొనసాగిస్తున్నారు.

బ్యాంకులకు వచ్చే ఖాతాదారుల దృష్టిని మళ్లించి నగదు, విలువైన వస్తువులను అపహరించే ముఠాలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మ్‌డ్‌ పోలీస్‌ సిబ్బంది, ప్రత్యేక బృందాల సహకారంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

నంబర్‌ ప్లేట్‌ లేకుంటే చర్యలు

నంబర్‌ ప్లేట్‌ లేని, స్పష్టంగా కనిపించని లేదా నంబర్‌ ప్లేట్‌ను వంచిన, మార్చిన వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీసీపీ భాస్కర్‌ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలకు అనుగుణంగా నంబర్‌ ప్లేట్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని తెలిపారు.

మంచిర్యాల మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్నందున నేరాలకు పాల్పడిన వ్యక్తులు సరిహద్దులు దాటి తప్పించుకునే అవకాశాలను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. పోలీసులు 24×7 అప్రమత్తంగా అందుబాటులో ఉంటారని తెలిపారు.

ప్రస్తుతం చేపడుతున్న నాకాబందీ నేర నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగమని, ముఖ్యమైన ప్రాంతాలు, రహదారులు, సరిహద్దుల్లో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డీసీపీ భాస్కర్‌ స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా ఉంచుకుని ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌రావు, ట్రాఫిక్‌ పోలీసులు, స్థానిక పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.