Mancherial: మంచిర్యాలలో నామమాత్రంగానే పౌరసరఫరాల శాఖ తనిఖీలు!

Mancherial: మంచిర్యాలలో బియ్యం ధరల నియంత్రణపై నామమాత్రపు తనిఖీలు. అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న వ్యాపారులు. చర్యలు తీసుకోవాలని వినియోగదారుల డిమాండ్.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 8:41 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో నామమాత్రంగానే పౌరసరఫరాల శాఖ తనిఖీలు!

Mancherial: మంచిర్యాల జిల్లాలో బియ్యం ధరల నియంత్రణపై పౌరసరఫరాల శాఖ అధికారులు చేస్తున్న తనిఖీలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం విక్రయ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలను తప్పనిసరిగా ప్రదర్శించాలని, నిర్ణీత ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ ఆదేశాలు ఆచరణలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అనేక దుకాణాల్లో ఇప్పటికీ ధరల పట్టికలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మంచిర్యాల పట్టణంలోని పలు బియ్యం దుకాణాలను జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. బీపీటీ బియ్యం కిలో రూ.66, తెలంగాణ సోనా, హెచ్‌ఎంటీ బియ్యం రూ.74, జైశ్రీరామ్ బియ్యం రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. ధరల వివరాలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే అధికారుల తనిఖీల తర్వాత కూడా వ్యాపారుల తీరులో మార్పు కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

మిల్లర్ల దగ్గరే అధిక ధరలు.. వ్యాపారులకు కొత్త సమస్య!

రైస్ మిల్లర్లే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తుంటే తాము ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎలా అమ్మాలని కిరాణా దుకాణాలు, రైస్ డిపో నిర్వాహకులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మిల్లుల వద్దే నిర్ణీత ధరలకు బియ్యం లభించనప్పుడు చిల్లర వ్యాపారులు తక్కువ ధరలకు విక్రయించడం ఎలా సాధ్యమని వారు అంటున్నారు. మరోవైపు పౌరసరఫరాల అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో బియ్యం అమ్మకాలు చేయడం లేదని, ధరలు పెరిగాయని చెప్పాలని కొందరు మిల్లర్లు దుకాణదారులకు సూచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ధర చెప్పినా.. బియ్యం ఇవ్వడం లేదంటున్న వినియోగదారులు!

ప్రభుత్వం నిర్ణయించిన ధరల వివరాలను చూపిస్తూ బియ్యం కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్తున్న వినియోగదారులకు నిరాశ ఎదురవుతోందని పలువురు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం బియ్యం కావాలని అడిగితే ఆ ధరలకు ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణ ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలని కోరుతున్నారు.

రైస్ మాఫియాపై చర్యలేవీ?

కేవలం కొన్ని దుకాణాలను తనిఖీ చేసి నోటీసులు ఇవ్వడం, హెచ్చరికలు జారీ చేయడంతో సమస్య పరిష్కారం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బియ్యం సరఫరా వ్యవస్థలో మిల్లర్ల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు, అక్కడి నుంచి రిటైల్ దుకాణాల వరకు ధరల తీరును అధికారులు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ధరల పట్టికలు ప్రదర్శించని వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతో పాటు మిల్లుల్లో బియ్యం కొనుగోలు, విక్రయ ధరలను తనిఖీ చేయాలని కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులో ధరలకు బియ్యం లభించేలా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన ధరలు క్షేత్రస్థాయిలో అమలవుతాయా? లేక వ్యాపారుల ఇష్టారాజ్యమే కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.