Mancherial: ఇందిరమ్మ లబ్ధిదారులకు బట్టలు పంపిణీ: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్

Mancherial: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దంపతులు లక్షెట్టిపేట్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నూతన వస్త్రాలు అందజేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 9 Nov 2026 4:37 PM IST
Mancherial
X

Mancherial: ఇందిరమ్మ లబ్ధిదారులకు బట్టలు పంపిణీ: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్

మంచిర్యాల: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా, వారి సంతోషంలోనూ భాగస్వాములవుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు ఆప్యాయత చాటుకున్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సంబరాల్లో భాగంగా సోమవారం లక్షెట్టిపేట్ మండలంలోని చందారం, పాత కొమ్ముగూడెం గ్రామాల్లో నూతన గృహప్రవేశాలు చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, నూతన వస్త్రాలు అందజేశారు. మిఠాయిలు తినిపించి గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సొంతింటిలోకి అడుగుపెట్టి నిరుపేద కుటుంబాలు ఆనందంగా జీవించడం ఎంతో సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

ఇళ్ల మంజూరుతోనే తమ బాధ్యత ముగిసిపోలేదన్నట్లుగా.. లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకల్లో స్వయంగా పాల్గొని, నూతన వస్త్రాలు అందజేసి వారి ఆనందంలో పాలుపంచుకోవడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.