Mancherial: మంచిర్యాల ఆసుపత్రికి రెండు కొత్త అంబులెన్సులు: కలెక్టర్!
Mancherial: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరైన 2 అంబులెన్సులను కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. డీఎంఎఫ్ నిధులతో ఆసుపత్రి అభివృద్ధి పనులు ముమ్మరం.
Mancherial: మంచిర్యాల ఆసుపత్రికి రెండు కొత్త అంబులెన్సులు: కలెక్టర్!
మంచిర్యాల: జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఆదర్శ వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరైన రెండు నూతన అంబులెన్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో డీఎంఎఫ్ నిధుల నుంచి వైద్య రంగానికి రూ.9 కోట్లకు పైగా కేటాయించినట్లు తెలిపారు. రూ.4 కోట్లకు పైగా విలువైన వైద్య పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేశామని, మరో రూ.4.2 కోట్ల నిధులతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. వెంటిలేటర్ల కొరతను అధిగమించేందుకు మాతా శిశు ఆసుపత్రికి నాలుగు, జనరల్ ఆసుపత్రికి ఆరు చొప్పున మొత్తం పది వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
మహిళలకు మెరుగైన శస్త్రచికిత్స సేవల కోసం రూ.80 లక్షల వ్యయంతో రెండు ల్యాపరోస్కోపీ యూనిట్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. హెచ్ఐవీ, హెపటైటిస్-బి వంటి హైరిస్క్ రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు మాతా శిశు ఆసుపత్రిలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోజుకు 1,700 నుంచి 2 వేల మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు.
కొత్త ఆసుపత్రి భవనంలో ట్రామా కేర్, క్రిటికల్ కేర్, ఐసీయూ, మాతా శిశు వైద్య సేవలు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్‌తో పాటు అన్ని రకాల వైద్య సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. జనవరి 26, 2027 నాటికి నూతన భవనంలో వైద్య సేవలు ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు న్యూరాలజిస్టులు, ఒక యూరాలజిస్టు నియామకం జరిగిందని, కార్డియాలజిస్టు నియామకంతో పాటు క్యాత్‌ల్యాబ్ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు 15 పీజీ సీట్లు మంజూరైనట్లు వివరించారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. వైద్యం, విద్య రంగాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో లభించే ఆధునిక వైద్య సదుపాయాలను మంచిర్యాలలోనే అందుబాటులోకి తీసుకొచ్చి, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు సేవాభావంతో పనిచేయాలని, కమీషన్ల కోసం రోగులను అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించే విధానాన్ని సహించబోమని హెచ్చరించారు. అంబులెన్స్ సేవలు, వివిధ మండలాల నుంచి రోగుల తరలింపు దూరాలు, ఛార్జీలపై మరో పది రోజుల్లో అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించిన రెండు అంబులెన్సులు దూర ప్రాంతాల రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జనవరి 26న నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ అశోక్, ఆర్ఎంఓ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాణేష్, వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




