Mancherial: ఎఉపాధి హామీతో నీటి సంరక్షణ పనులు చేపట్టాలి: మంచిర్యాల డీసీ!
Mancherial: ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి రాకుండా ఉపాధి హామీతో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య దండేపల్లి మండలంలో ఆదేశించారు.
Mancherial: ఎఉపాధి హామీతో నీటి సంరక్షణ పనులు చేపట్టాలి: మంచిర్యాల డీసీ!
మంచిర్యాల, నవంబర్ 4: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షపు నీటిని ప్రతి చుక్కా ఒడిసిపట్టేలా విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సూచించారు. నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా భాగస్వాములై సామూహికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బుధవారం దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అదనపు కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నీటి సంరక్షణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంకుడు గుంతలు, నీటి తొట్టెలు, నీటి కుంటలు, వ్యవసాయ కుంటలు, పైకప్పులపై పడే వర్షపు నీటిని నిల్వ చేసే నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టాలని సూచించారు.
రెబ్బనపల్లి గ్రామంలో వ్యవసాయ కుంట నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్.. అక్కడ పనిచేస్తున్న సుమారు 50 మంది కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీ వేతనాలు, పెన్షన్ దరఖాస్తులు, తాగునీరు, పని ప్రదేశాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. లింగాపూర్, మాకూలపేట్ గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో చేపట్టిన కందకాల నిర్మాణ పనులను పరిశీలించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో సమస్య ఉందని స్థానికులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు. సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ఫోన్ చేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మేట్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద అందుబాటులో ఉన్న వివిధ పనులను సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రతి గ్రామంలో రోజూ కనీసం 50 నుంచి 60 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి సంరక్షణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని సూచించారు.
అంతకుముందు గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పుష్కర్ ఘాట్‌ను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గూడెం జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
రెబ్బనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. వెల్గనూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను తనిఖీ చేశారు. ద్వారక గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాబోధన తీరును పరిశీలించారు. విద్యార్థులకు నిర్ణీత మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని, నాణ్యమైన విద్యాబోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామంలో నిర్మించిన మ్యాజిక్ ఇంకుడు గుంతలు, సామూహిక, వ్యక్తిగత ఇంకుడు గుంతలను కూడా పరిశీలించారు.
రాబోయే రోజుల్లో నీటి కొరతను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో నీటి సంరక్షణ ఉద్యమంలా సాగాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ అచ్యుత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




