Mancherial: రైతులకు డిజిటల్ సేవలు మరింత చేరువ చేయాలి

Mancherial: రైతులకు డిజిటల్ సేవలు విస్తృతం చేసి, అగ్రిస్టాక్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 Oct 2026 7:13 PM IST
Mancherial
X

Mancherial: రైతులకు డిజిటల్ సేవలు మరింత చేరువ చేయాలి

మంచిర్యాల: వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసి, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను రైతులకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్రిస్టాక్ డిజిటల్ వ్యవస్థను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

శుక్రవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అగ్రిస్టాక్ అమలు పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమగ్ర సమాచారాన్ని డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచడం ద్వారా వ్యవసాయ రంగంలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

అగ్రిస్టాక్‌లో భాగంగా రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) కేటాయించడంతో పాటు గ్రామాల భౌగోళిక మ్యాపుల నమోదు, పంటల సాగు వివరాల రిజిస్ట్రీలను రూపొందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు రైతు ఐడీల నమోదులో 70.4 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. అలాగే గ్రామాల మ్యాపులను జియో రిఫరెన్స్ చేసే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

వానాకాలం 2026 సీజన్‌కు సంబంధించి వ్యవసాయ ప్లాట్లను డిజిటల్ క్రాప్ సర్వేకు గుర్తించగా, స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా ఇప్పటివరకు 88.63 శాతం పంటల వివరాలను నమోదు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన వివరాల నమోదును కూడా వేగవంతం చేయాలని సూచించారు.

అగ్రిస్టాక్ ద్వారా వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్, పౌరసరఫరాలు, ఎరువుల నిర్వహణ, విత్తనాల పంపిణీ, పంటల బీమా, బ్యాంకింగ్, వ్యవసాయ రుణాలు, పీఎం కిసాన్, వ్యవసాయ యాంత్రీకరణ వంటి అనేక రంగాల్లో డిజిటల్ సేవలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు.

రైతుల వివరాల ఆధారంగా ఎరువుల బుకింగ్, విక్రయాలు, విత్తనాల పంపిణీతో పాటు ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు, పంటల బీమా, వ్యవసాయ రుణాల మంజూరు వంటి సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అగ్రిస్టాక్ దోహదపడుతుందని వివరించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచి, రైతులకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.