Mancherial: భూ భారతి, రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి

Mancherial: మంచిర్యాల జిల్లా నస్పూర్, హాజీపూర్‌లలో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటన. భూ భారతి, రీ-సర్వే, ఓటరు సవరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 22 Oct 2026 5:26 PM IST
Mancherial
X

Mancherial: భూ భారతి, రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి

మంచిర్యాల జిల్లా: భూ భారతి, భూముల రీ-సర్వే, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం నస్పూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి, వివిధ పనుల పురోగతిపై సమీక్షించారు.

కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. సాదా బైనామా, భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో భూ భారతి, రీ-సర్వే, ఓటరు జాబితా సవరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు.

రైతులకు మార్కెటింగ్‌పై అవగాహన కల్పించాలి

గుడిపేట గ్రామ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన వ్యవసాయ మార్కెటింగ్, పత్తి విక్రయాలు, మద్దతు ధరలపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులకు పంటల మార్కెటింగ్ విధానాలు, పత్తి విక్రయాలు, మద్దతు ధరలకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించాలని అధికారులకు సూచించారు.

అనంతరం నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పునరుద్ధరణపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగాన్ని తగ్గించి, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, పంట మార్పిడి, పంట వ్యర్థాల నిర్వహణ, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

సాగు ఖర్చులను తగ్గించి, రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.