Mancherial: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కలెక్టర్ కుమార్ దీపక్!
Mancherial: మంచిర్యాలలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, అట్రాసిటీ కేసులపై కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష. బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు ఆదేశం.
Mancherial: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కలెక్టర్ కుమార్ దీపక్!
Mancherial: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాధితులకు న్యాయం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అట్రాసిటీ కేసులను కార్యాచరణ ప్రకారం పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు కేసులుగా తేలిన వాటి వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇళ్లు నిర్మించుకోలేని వారికి గుత్తేదారుల సమన్వయంతో ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ అధికారిని నియమించాలని తెలిపారు.
ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో మూత్రశాలలు, తాగునీరు, ప్రహరీ గోడలు తదితర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కూరగాయల సరఫరా కోసం గుత్తేదారును ఏర్పాటు చేయాలని సూచించారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు అందించాలని తెలిపారు. ఉపకార వేతనాల మంజూరుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గంజాయి, నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం, క్రయవిక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినోత్సవం ద్వారా ప్రజలకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించాలని తెలిపారు.
డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామపంచాయతీల్లో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అట్రాసిటీ కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగిస్తూ సరైన ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు.
సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, అదనపు కలెక్టర్ వి. రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీఆర్వో మోతిరామ్, ఏసీపీలు ప్రకాష్, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




