Mancherial: పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి కలెక్టర్ కుమార్ దీపక్
Mancherial: మంచిర్యాల సమీకృత కలెక్టరేట్‌లో పంటల వైవిధ్యీకరణపై కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష. ఖేత్ బచావో అభియాన్ ద్వారా ఆరుతడి పంటల సాగుపై అవగాహనకు ఆదేశం.
Mancherial: పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలి కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల: ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
శుక్రవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి మండల వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నవంబర్ 30వ తేదీ వరకు జిల్లాలోని రైతు వేదికల్లో నిర్వహించే ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేపట్టి రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా పంటల వైవిధ్యీకరణ ప్రణాళికలు రూపొందించి, గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు విత్తన విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర, వరి సన్నధాన్యం కొనుగోళ్లు, పత్తి కోతలు, కొనుగోలు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడంతో పాటు కూరగాయల విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
కడెం ప్రాజెక్టు నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. యాసంగి సీజన్‌లో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే అవకాశమున్నందున, రైతులను ఆరుతడి పంటల సాగు వైపు ప్రోత్సహించాలని తెలిపారు.
కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు సాగు విధానాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తక్కువ నీటితో విజయవంతంగా పంటలు సాగు చేస్తున్న రైతులను గ్రామాల వారీగా గుర్తించి, వారు అనుసరిస్తున్న పద్ధతులను ఇతర రైతులకు వివరించాలని ఆదేశించారు.
నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ వ్యవసాయంలో మెరుగైన దిగుబడులు సాధించేలా రైతులకు మార్గనిర్దేశం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.




