Mancherial: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్ కుమార్ దీపక్!

Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల వేగవంతం, నవంబర్ 12లోగా కొత్త పింఛన్ల మంజూరుకు అధికారులను ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 9 Nov 2026 7:57 PM IST
Mancherial
X

Mancherial: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్ కుమార్ దీపక్!

మంచిర్యాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, రెండో విడత ఇళ్లకు సంబంధించి అర్హులైన పేదలను త్వరితగతిన గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల వివరాలు సేకరించి, పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని సూచించారు. అనర్హుల స్థానంలో అర్హులైన పేదలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి ఇంటి నిర్మాణ దశలను ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు, పూర్తయిన ఇళ్ల వివరాలను వెంటనే నమోదు చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ నెల 12లోగా కొత్త పింఛన్ల మంజూరు

చేయూత పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఈ నెల 12వ తేదీలోగా అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఈ నెల 12న కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ చేపట్టి, 12 నుంచి 18వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల సమక్షంలో మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని తెలిపారు. ఈ నెల 19న అర్హులైన పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించే దిశగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు తప్పనిసరిగా చేపట్టాలన్నారు. సాగునీటి చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. పశువులకు పశుగ్రాసం, తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, పనులకు సంబంధించి సరైన కొలతల పుస్తకం (ఎం.బి.) నమోదు చేయకుండా బిల్లులు సమర్పించినా, చెల్లింపులు చేసినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రతిరోజూ పంచాయతీ కార్యదర్శులతో గూగుల్ మీట్ నిర్వహించి గ్రామాల్లో అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ సమస్యలపై సమీక్షించాలని ఆదేశించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా, అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, డీఆర్డీఓ, ఇన్‌చార్జి డీపీఓ కిషన్, హౌసింగ్ పీడీ బన్సీలాల్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.