Mancherial: భూ వివాదాలపై అవగాహన కోసం ‘రైతుకు రక్షణ’ లఘు చిత్రం విడుదల
Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో భూ వివాదాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన ‘రైతుకు రక్షణ’ లఘు చిత్రాన్ని విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
Mancherial: భూ వివాదాలపై అవగాహన కోసం ‘రైతుకు రక్షణ’ లఘు చిత్రం విడుదల
మంచిర్యాల: భూ వివాదాలు, వాటి కారణంగా కుటుంబాల మధ్య తలెత్తుతున్న సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ‘రైతుకు రక్షణ’ లఘు చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు తదితర అధికారులతో కలిసి ‘రైతుకు రక్షణ’ లఘు చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా భూములకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయని, వారసత్వంగా సంక్రమించే భూముల పంపిణీ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్వహించిన భూ సర్వేల ఆధారంగా రూపొందించిన రెవెన్యూ రికార్డులు ఇప్పటికీ కొనసాగుతుండటంతో భూ సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
భూ వివాదాలకు సంబంధించిన కేసులు న్యాయస్థానాల్లో అధికంగా ఉండటంతో పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. కుటుంబ సభ్యులందరూ పరస్పర అంగీకారంతో భూములను పంపిణీ చేసుకుంటే వివాదాలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. భూముల పంపిణీలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం లఘు చిత్ర దర్శకుడు నాగరాజు రూపొందించిన ‘రైతుకు రక్షణ’ చిత్ర గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజును శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




