Mancherial: భూ వివాదాలకు చెక్.. రైతులకు పక్కా హద్దులు!

Mancherial: మంచిర్యాల జిల్లాలో 12 గ్రామాల్లో భూ సర్వే పూర్తయిందని, డిజిటల్ మ్యాపులతో 95 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 19 Nov 2026 6:03 PM IST
Mancherial
X

Mancherial: భూ వివాదాలకు చెక్.. రైతులకు పక్కా హద్దులు!

మంచిర్యాల: భూముల హద్దుల వివాదాలు, కొలతల్లో వ్యత్యాసాలు, ఆక్రమణల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కీలకంగా మారనుంది. రైతుల భూములకు కచ్చితమైన హద్దులు గుర్తించి, భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా పక్కా రికార్డులు రూపొందించడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

సమగ్ర భూ సర్వే అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం భీమిని మండలం రాజారాం, కన్నెపల్లి మండలం నాగపల్లి గ్రామాల్లో నిర్వహించిన సదస్సులకు కలెక్టర్ హాజరై రైతులకు సర్వే ప్రక్రియపై వివరించారు. భూముల కొలతలు, పట్టా రికార్డులు, వాస్తవ సాగు విస్తీర్ణం మధ్య ఉన్న వ్యత్యాసాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సర్వే ద్వారా వాస్తవ భూ విస్తీర్ణాన్ని గుర్తించి పారదర్శకమైన డిజిటల్ రికార్డులు, మ్యాపులు రూపొందించనున్నట్లు వెల్లడించారు.

సర్వేకు ముందు రైతులకు జెండాలు అందజేస్తామని, సర్వే తేదీకి రెండు రోజుల ముందే తమ భూముల నాలుగు వైపులా వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు తీసుకుని భూముల కచ్చితమైన హద్దులను గుర్తిస్తారని తెలిపారు. భూముల కోఆర్డినేట్స్ ఆధారంగా డిజిటల్ మ్యాపులు రూపొందించడంతో భవిష్యత్తులో ఎప్పుడైనా భూముల సరిహద్దులను గుర్తించేందుకు వీలుంటుందని, ఆక్రమణలు, హద్దుల వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని వివరించారు.

ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించి భూమి విస్తీర్ణం, పట్టాదారుల వివరాలను అనుసంధానించి సమగ్ర మ్యాపులు తయారు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో భూముల కొనుగోలు, అమ్మకాలు, వారసత్వ బదిలీలకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు నమోదు చేయడంతో భూ వివరాల్లో పారదర్శకత పెరుగుతుందన్నారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములు, లావుని పట్టా భూముల వాస్తవ విస్తీర్ణాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి మధ్య వ్యత్యాసాలు గుర్తించిన రైతులకు వివరాలతో కూడిన జాబితాలను అందజేస్తామని తెలిపారు. రైతులు పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తామని, అంగీకారం కుదరని సందర్భాల్లో నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ వివాదాలు, సంతకాల సమస్యలు వంటి సివిల్ వివాదాలను న్యాయస్థానాల పరిధిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లాలో ఇప్పటికే 12 గ్రామాల్లో భూ సర్వే పూర్తయిందని, ఈ ప్రక్రియ ద్వారా 90 నుంచి 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణం ఉన్న గ్రామంలో 15 రోజుల్లో సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. సర్వే అనంతరం రైతుల సమక్షంలో భూముల విస్తీర్ణ వివరాలు వెల్లడించి సంతకాలు తీసుకుంటామని, అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. రైతులందరూ సర్వేకు సహకరించి తమ భూముల హద్దులను సక్రమంగా గుర్తించుకోవాలని సూచించారు.

అనంతరం రాజారాం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని, పాఠశాలలు, అంగన్వాడీల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, సంబంధిత మండల తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.