Mancherial: పాఠశాలలు, ఆసుపత్రులపై మంచిర్యాల కలెక్టర్ ప్రత్యేక దృష్టి

Mancherial: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి, జన్నారంలో పర్యటించి పాఠశాలలు, ఆసుపత్రులను తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వయంగా లెక్కలు చెప్పారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 Oct 2026 5:14 PM IST
Mancherial
X

Mancherial: పాఠశాలలు, ఆసుపత్రులపై మంచిర్యాల కలెక్టర్ ప్రత్యేక దృష్టి

మంచిర్యాల: ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పనితీరును పర్యవేక్షించాలని సూచించారు.

శుక్రవారం దండేపల్లి, జన్నారం మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. దండేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న కళాశాల భవన నిర్మాణ పనులను టెండర్ ప్రక్రియ ద్వారా పూర్తి చేసి త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ స్వయంగా గణిత పాఠాలు బోధించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించి, విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, పడకలు, రిజిస్టర్లు, రోగులకు అందుతున్న వైద్య సేవలను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండటానికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ గర్భిణులు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, రెవెన్యూ సంబంధిత పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు.

జన్నారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, భోజన వసతులు, మెనూ అమలును తనిఖీ చేసి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మాణంలో ఉన్న అదనపు గదులను పరిశీలించి మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థినులకు నిర్ణీత మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న భోజనశాల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, ఆసుపత్రి నిర్వహణను పరిశీలించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదైన గ్రామాల వివరాలను సేకరించి ఆయా ప్రాంతాల్లో నీటి నమూనాలను పరీక్షించాలని వైద్యాధికారులకు సూచించారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారానికోసారి లేదా కనీసం నెలకు ఒకసారి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం తహసీల్దార్ జి. బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్‌లతో కలిసి భూభారతి దరఖాస్తులు, పెండింగ్ రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, పారిశుధ్య కార్యక్రమాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.