Mancherial: విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్

Mancherial: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పలు మండలాల్లో విద్యాసంస్థలను తనిఖీ చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఓకు షోకాజ్ నోటీసు ఇచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Oct 2026 6:15 PM IST
Mancherial
X

Mancherial: విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్

మంచిర్యాల: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం కాసిపేట, తాండూర్ మండలాలతో పాటు బెల్లంపల్లిలో పలు విద్యాసంస్థలు, నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అదనపు గదుల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. వంటశాలను తనిఖీ చేసి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని, వంటకు తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు వినియోగించాలని సూచించారు. అనంతరం రేకులగూడలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల పంచాయతీ అధికారి సబ్దర్ అలీతో కలిసి సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.

తాండూర్ మండలం తంగళ్లపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డి.ఎ. జుగా వసతి గృహ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులంతా క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు.

తాండూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న భోజనశాల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తరగతి గదులను పరిశీలించిన సందర్భంగా విద్యార్థులకు సరైన విద్యా వాతావరణం కల్పించడంలో నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించి, సంబంధిత స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.

అనంతరం బెల్లంపల్లిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భూభారతి, భూదాన్ భూములు, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, రెవెన్యూ సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.