Mancherial: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్!
Mancherial: మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లి మండలాల్లో కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు. పాఠశాలల్లో వసతులు, ఇందిరమ్మ ఇళ్లు, పీహెచ్‌సీల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Mancherial: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి: కలెక్టర్!
మంచిర్యాల, నవంబర్ 4: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్య, మెరుగైన భోజన సదుపాయాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
బుధవారం భీమిని, కన్నెపల్లి మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి విద్య, వైద్యం, గృహ నిర్మాణాలు, మహిళా సంఘాల భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భీమిని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, భోజనశాల పనుల పురోగతిని తనిఖీ చేశారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థినులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, వంటశాల, భోజనశాల నిర్వహణలో పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు.
అనంతరం మల్లిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు.
గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న వి.ఓ. భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు అనువైన వసతులు కల్పించేలా భవనాన్ని నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచించారు.
తదుపరి కన్నెపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి ప్రహరీ గోడ నిర్మాణ పనులు, పూర్తయిన భోజనశాలను పరిశీలించారు. విద్యార్థినులకు నిర్ణీత మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంటశాల నిర్వహణతో పాటు పాఠశాలలో అవసరమైన ఇతర సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం రైతు వేదికలో ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న వి.బి.-జి రామ్ జి శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. శిక్షణ పొందుతున్న సిబ్బందికి అందిస్తున్న అవగాహన, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించి, పథకం అమలు, విధివిధానాలపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భీమిని మండల తహసీల్దార్ బికర్ణదాస్, కన్నెపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




