Mancherial: సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం: కలెక్టర్ కుమార్ దీపక్!

Mancherial: సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర విశిష్టమైనదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి. ఐడీవోసీలో ఘనంగా విశ్వకర్మ జయంతి, స్వచ్ఛత హి సేవ పోస్టర్ల ఆవిష్కరణ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 17 Sept 2026 10:00 PM IST
Mancherial
X

Mancherial: సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం: కలెక్టర్ కుమార్ దీపక్!

మంచిర్యాల: సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో విశిష్టమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం విశ్వకర్మ జయంతి సందర్భంగా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, డీసీపీ ఏ. భాస్కర్, అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల్లో విశ్వకర్మను దైవ శిల్పిగా, నిర్మాణకర్తగా గౌరవిస్తారని తెలిపారు. వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారులు, కంచరి, శిల్పకళ తదితర సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తున్న విశ్వకర్మ వృత్తిదారులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. సంప్రదాయ వృత్తులను పరిరక్షించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా అందుతున్న శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డీసీపీ ఏ. భాస్కర్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో వివిధ వృత్తుల వారి సేవలు ఎంతో విలువైనవని, సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తూ సేవలందిస్తున్న విశ్వకర్మ వృత్తిదారుల పాత్ర అభినందనీయమని అన్నారు.

అనంతరం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న స్వచ్ఛత హి సేవ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు, వృత్తిదారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.