Mancherial: భూ భారతి, భూదాన్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి CCLA!

Mancherial: భూదాన్ భూములు, భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులకు CCLA లోకేష్ కుమార్ ఆదేశం. VCలో పాల్గొన్న మంచిర్యాల అదనపు కలెక్టర్ రాములు.

Indu
By Indu
Published on: 28 Oct 2026 6:22 PM IST
Mancherial
X

Mancherial: భూ భారతి, భూదాన్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి CCLA!

Mancherial: భూదాన్ భూములు, భూముల రీ సర్వే, భూ భారతి పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూ పరిపాలనకు సంబంధించిన పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

బుధవారం హైదరాబాద్‌లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), కలెక్టరేట్ పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూదాన్ భూములు, రీ సర్వే ప్రక్రియ, కోర్టు కేసులు, భూసేకరణ, జీఓలు 59, 76, 118 కింద క్రమబద్ధీకరణ దరఖాస్తులు, భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ కేసుల పురోగతిపై సమీక్షించారు.

భూదాన్ భూములకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయడంతో పాటు, రీ సర్వే పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని లోకేష్ కుమార్ సూచించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, భూసేకరణ ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.

అలాగే, పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) భూములు, జీఓలు 59, 76, 118 కింద పెండింగ్‌లో ఉన్న క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, అర్హతలు, రికార్డుల ఆధారంగా దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులపై విచారణ చేపట్టి, సంబంధిత భూ రికార్డులను పరిశీలిస్తూ వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన కేసుల పురోగతిని వేగవంతం చేయాలని, భూ పరిపాలనకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే పనులు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భూ భారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో, నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, బి, డి సెక్షన్ల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Indu

Indu