Mancherial: బొక్కలగుట్టలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి!

Mancherial: మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్, రామకృష్ణాపూర్ పోలీసులు దాడులు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.

P.THAVITINAIDU,  ETCHARLA
Published on: 27 Nov 2026 12:03 PM IST
Mancherial
X

Mancherial: బొక్కలగుట్టలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి!

మంచిర్యాల: జిల్లాలోని బొక్కలగుట్ట పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, రామకృష్ణాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.25,890 నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి బొక్కలగుట్ట పరిధిలోని సిరామిక్ ఫ్యాక్టరీ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై దీకొండ రమేష్, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్, సిబ్బందితో పాటు రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీధర్, పోలీసు సిబ్బంది సంయుక్తంగా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నారు.

అరెస్టయిన వారిలో మంచిర్యాల విద్యానగర్‌కు చెందిన నాతడి రామ మహేందర్, బొక్కలగుట్టకు చెందిన మల్ల కేదారి, రామకృష్ణాపూర్ బీ-జోన్‌కు చెందిన తూడి శ్రీనివాస్, మందమర్రికి చెందిన తాండ్ర సుధాకర్, రామకృష్ణాపూర్‌కు చెందిన షేక్ చాంద్ పాషా, మంచిర్యాల గద్దెరగడికి చెందిన గన్నవేని సుధాకర్ ఉన్నారు.

పట్టుబడిన ఆరుగురితో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

P.THAVITINAIDU,  ETCHARLA

P.THAVITINAIDU, ETCHARLA