Mancherial: కేజీబీవీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: చంద్రయ్య!

Mancherial: నస్పూర్ కేజీబీవీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంచిర్యాల అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య పరిశీలించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 3 Nov 2026 9:05 PM IST
Mancherial
X

Mancherial: కేజీబీవీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: చంద్రయ్య!

మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతి, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మంగళవారం నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు తరగతి గదులు, వసతి గృహాలు, వంటగది, తాగునీటి సదుపాయాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, వారికి అందుతున్న సౌకర్యాలపై ఉపాధ్యాయులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి విద్యా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, వసతి సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. వసతి గృహాలు, వంటగదిలో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని, విద్యార్థులకు అందించే సౌకర్యాల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

మరోవైపు నీటి వృథాను అరికట్టాలని, పైప్‌లైన్లలో లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల వివరాల నమోదు, రికార్డుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ వివరాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పాఠశాల ప్రధాన భవనం వెలుపల సరైన లైటింగ్ సదుపాయం లేని విషయాన్ని గుర్తించిన అదనపు కలెక్టర్ వెంటనే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూఐడీసీ ఏఈ బషీర్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గుత్తేదారు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.