Chandrapur: అక్రమ విద్యుత్ తీగలకు బలైన తల్లి ఎలుగుబంటి, పిల్ల!
Chandrapur: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో అడవి పందుల కోసం పొలంలో అమర్చిన అక్రమ విద్యుత్ తీగలకు తగిలి తల్లి ఎలుగుబంటి, నాలుగు నెలల పిల్ల విద్యుదాఘాతంతో మృతి చెందాయి.
Chandrapur: అక్రమ విద్యుత్ తీగలకు బలైన తల్లి ఎలుగుబంటి, పిల్ల!
చంద్రాపూర్: అడవి పందుల నుంచి పంటలను రక్షించేందుకు పొలంలో అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగలు రెండు ఎలుగుబంట్ల ప్రాణాలను బలిగొన్నాయి. తల్లి ఎలుగుబంటితో పాటు నాలుగు నెలల వయసున్న పిల్ల విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా, మరో రెండు పిల్లలను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన చంద్రపూర్ జిల్లా చిమూర్ బీట్ పరిధిలోని కవడశి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.
తలోధి నాయక్‌కు చెందిన ఫకీరా రణదివే లీజుకు తీసుకున్న పత్తి, వరి పొలంలో అడవి పందుల నుంచి పంటను కాపాడేందుకు అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చినట్లు సమాచారం. అటుగా వచ్చిన తల్లి ఎలుగుబంటి, నాలుగు నెలల పిల్ల ఆ తీగలకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాయి.
అదే సమయంలో చెట్టుపైకి ఎక్కిన మరో రెండు ఎలుగుబంటి పిల్లలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు, బాణసంచా కాల్చి వాటిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి మృతి చెందిన ఎలుగుబంట్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖడ్సంగిలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.
పంటల రక్షణ కోసం అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చడం వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. అడవుల సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఇలాంటి ప్రమాదకర చర్యలు వన్యప్రాణుల మరణాలకు కారణమవుతుండటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు మనుషులకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడంతో అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.




