Asifabad: నకిలీ లోన్ యాప్‌లతో జాగ్రత్త.. సైబర్ మోసాలపై ఎస్పీ హెచ్చరిక!

Asifabad: తక్షణ రుణాల పేరిట మోసగించే నకిలీ లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 16 Oct 2026 7:07 PM IST
Asifabad
X

Asifabad: నకిలీ లోన్ యాప్‌లతో జాగ్రత్త.. సైబర్ మోసాలపై ఎస్పీ హెచ్చరిక!

కొమురం భీమ్ ఆసిఫాబాద్: తక్షణ రుణాల పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. అత్యవసర ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని నకిలీ లోన్ యాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ మోసాలపై అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తక్కువ సమయంలో రుణాలు మంజూరు చేస్తామని, ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే లోన్ ఇస్తామని ఆకర్షించే ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. రుణం మంజూరు చేయడానికి ముందుగానే ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ ఛార్జీలు, ఇతర రుసుముల పేరుతో డబ్బులు చెల్లించాలని కోరితే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిజమైన ఆర్థిక సంస్థనా, నకిలీ సంస్థనా అన్నది నిర్ధారించుకున్న తర్వాతే రుణం కోసం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.

మూడు సూత్రాలతో సైబర్ మోసాలకు చెక్!

లోన్ యాప్‌ల విషయంలో ప్రజలు ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి అనే మూడు సూత్రాలను పాటించాలని ఎస్పీ సూచించారు. ముందస్తు చెల్లింపుల పేరుతో డబ్బులు పంపవద్దని, రుణాలు అందించే సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, సంప్రదింపు వివరాలు, విశ్వసనీయతను పరిశీలించాలని తెలిపారు.

అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం లేదా డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఒక్క తొందరపాటు చెల్లింపు వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబంపై కూడా ఆర్థిక ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.

సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి

ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్, ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, డి.ఫోర్.సి ఆర్‌ఎస్‌ఐ కిరణ్, ఎస్‌ఐ దివ్యతో పాటు డి.ఫోర్.సి బృందం సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.