Asifabad: ఆసిఫాబాద్, వాంకిడి పోలీస్ స్టేషన్లలో డీఐజీ అంబర్ కిషోర్ ఝా తనిఖీ!
Asifabad: కుమురం భీం జిల్లాలో కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా పర్యటన. ఆసిఫాబాద్, వాంకిడి పోలీస్ స్టేషన్లలో రికార్డులు తనిఖీ.. కేసుల వేగవంతమైన పరిష్కారానికి ఆదేశం.
Asifabad: ఆసిఫాబాద్, వాంకిడి పోలీస్ స్టేషన్లలో డీఐజీ అంబర్ కిషోర్ ఝా తనిఖీ!
ఆసిఫాబాద్: కుమురం భీమ్ జిల్లా కాళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ శనివారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్, వాంకిడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ డీఐజీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని డీఐజీ పరిశీలించారు. తీవ్రమైన నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లను తనిఖీ చేసి.. కేసుల ప్రస్తుత స్థితి, నిందితుల అరెస్టులు, పెండింగ్‌కు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం ఉండాలని, ప్రతి కేసులో అన్ని ఆధారాలను క్షుణ్ణంగా సేకరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, న్యాయస్థానాల్లో కేసుల పురోగతికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని, 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా భద్రపరచడంతో పాటు వాటి వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీఐజీ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పోలీసులు పనిచేయాలని ఆదేశించారు.
అనంతరం పోలీస్ సిబ్బంది కిట్‌ను పరిశీలించి, శాఖాపరమైన అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్ కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




