Kagaznagar: సర్‌సిల్క్ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
Kagaznagar: కాగజ్‌నగర్ సర్‌సిల్క్ బాధితుల ఇళ్ల ఖాళీ నోటీసులపై స్పందించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, పేదల హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Kagaznagar: సర్‌సిల్క్ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
కాగజ్‌నగర్: సర్‌సిల్క్ ప్రాంత ప్రజలకు అధికారులు జారీ చేసిన ఇళ్ల ఖాళీ నోటీసుల వ్యవహారంపై బాధితులతో సమావేశం నిర్వహించేందుకు కాగజ్‌నగర్‌కు విచ్చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సర్‌సిల్క్ బాధితుల ఇళ్లు, హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
50 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం దారుణమని ఆయన అన్నారు. ఇందిరమ్మ పాలన అంటే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి కానీ, ఇప్పటికే ఉన్న ఇళ్లను కూల్చడం కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా పేదల ఇళ్లకు నోటీసులు జారీ అవుతాయా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందా.. పెట్టుబడిదారుల పక్షాన ఉంటుందా అని నిలదీశారు.
ఇంటి నంబర్లు, విద్యుత్ మీటర్లు, నీటి పన్నులు ఉన్నప్పటికీ ఇళ్ల ఖాళీ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేటీఆర్ సూచన మేరకు బాధితులకు న్యాయసహాయం అందించేందుకు లీగల్ టీమ్ వచ్చిందని తెలిపారు. బాధితుల ఇళ్లతో పాటు వారి ఉపాధి, విద్యా హక్కులను కూడా కాపాడేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలోనే కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మెడికల్ కాలేజీ ఏర్పాటు జరిగాయని గుర్తుచేశారు. గురుకులాల అభివృద్ధిలో కేసీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రాణహిత నది పక్కనే ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలను నిరాశ్రయులను చేయడం మానుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.




