Bellampalli: జర్నలిస్టులకు పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి..ఎమ్మెల్యేకు వినతి!
Bellampalli: జర్నలిస్టులకు పెన్షన్, ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు.
Bellampalli: జర్నలిస్టులకు పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి..ఎమ్మెల్యేకు వినతి!
Bellampalli: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు పెన్షన్‌తో పాటు ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు సోమవారం రాత్రి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు తమ గళం, కలం ద్వారా చురుకైన పాత్ర పోషించారని ఎమ్మెల్యేకు వివరించారు. వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు పదవీ విరమణ అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు జారీ చేసే ప్రకటనలతో పాటు అర్హత కలిగిన మీడియా ప్రకటనల ఆదాయంలో 10 శాతం మొత్తాన్ని జర్నలిస్టుల పెన్షన్, సంక్షేమ నిధికి కేటాయించేలా చట్టబద్ధమైన విధానాన్ని రూపొందించాలని కోరారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలకు సిఫారసు చేయాలని ఎమ్మెల్యేను అభ్యర్థించారు.
జర్నలిస్టుల వినతిపై ఎమ్మెల్యే గడ్డం వినోద్ సానుకూలంగా స్పందించారు. పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రామ్ శెట్టి వల్లభాయ్, ఆకుల శివప్రసాద్, పులియాల రాజు, పూదరి నగేష్, వికాస్ యాదవ్, ఇడిదివేని రాధాకృష్ణ, కొలిపాక శ్రీనివాస్, బడుగు శ్రీనివాస్, అనుదీప్, అందుగుల రమేష్, రాజశేఖర్ మోహన్, మనోజ్ పాండే, దండబోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




