Mancherial: జైపూర్ ఎస్టీపీపీలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్!
Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీ పవర్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ఆధ్వర్యంలో ఉగ్రవాద వ్యతిరేక మాక్ డ్రిల్ నిర్వహించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షించారు.
Mancherial: జైపూర్ ఎస్టీపీపీలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్టీపీపీ పవర్ ప్లాంట్ మరియు పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ ని నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఆక్టోపస్ సీనియర్ పోలీసు అధికారుల పర్యవేక్షణలో అత్యాధునిక ఆయుధాలతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఉగ్రవాద సంస్థలు రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు,భారీ పరిశ్రమలు వంటి కీలక మౌలిక వసతులను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి కీలక ప్రాజెక్టులపై ఉగ్రవాదులు లేదా అసాంఘిక శక్తులు దాడికి పాల్పడిన సందర్భంలో,అక్కడి భద్రతా సిబ్బంది సమర్థవంతంగా స్పందించకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని,
ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలి,దాడిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించడమే మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించే విధానంపై సిబ్బందికి అవగాహన కలుగుతుందని, భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. అలాగే స్థానిక పోలీసులు, ప్లాంట్ భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది,ప్రాజెక్ట్ నిర్వహణ సిబ్బంది మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇటువంటి మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ మాక్ డ్రిల్‌లో రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్ కుమార్,ఎస్ఐ భూమేష్, స్థానిక పోలీసు సిబ్బంది,ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సిబ్బంది, ప్లాంట్ భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.




