Mancherial: హెచ్‌ఎంటీవీ ఎఫెక్ట్: బియ్యం ధరలపై అధికారుల దిద్దుబాటు చర్యలు!
Mancherial: హెచ్‌ఎంటీవీ కథనాల ప్రభావంతో మంచిర్యాలలో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అధిక ధరలకు అమ్మితే చర్యలని హెచ్చరించారు.
Mancherial: హెచ్‌ఎంటీవీ ఎఫెక్ట్: బియ్యం ధరలపై అధికారుల దిద్దుబాటు చర్యలు!
మంచిర్యాల: బియ్యం ధరల పెరుగుదలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చాయి. సామాన్యులు బియ్యం కొనాలంటేనే భయపడుతున్నారని, మార్కెట్‌లో ధరల నియంత్రణ కొరవడిందని హెచ్ఎంటీవీ వెలుగులోకి తెచ్చిన కథనాల నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించేలా మంచిర్యాల పట్టణంలో ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో బియ్యం ధరల నియంత్రణపై యంత్రాంగం దృష్టి సారించినట్లయింది.
మంచిర్యాల పట్టణంలోని మెయిన్ రోడ్డులో శ్రీనాథ్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్‌చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బియ్యం వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ సామాన్యులకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను సాకుగా చూపి అధిక ధరలకు విక్రయాలు జరపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ధరలకు అనుగుణంగా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని, వ్యాపారులు అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ ప్రత్యేక అవుట్‌లెట్‌లో 26 కిలోల ప్రీమియం క్వాలిటీ బీపీటీ రా రైస్ బస్తాను రూ.1,430కు, హెచ్‌ఎంటీ స్టీమ్ రైస్ బస్తాను రూ.1,898కు విక్రయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గజానన్ ఇండస్ట్రీస్ ప్రభుత్వ నిర్దేశిత ధరలకు బియ్యం అందించేందుకు ముందుకు రావడాన్ని కలెక్టర్ అభినందించారు.
మరోవైపు, బియ్యం ధరల నియంత్రణ కోసం ప్రత్యేక విక్రయ కేంద్రం ఏర్పాటు చేయడం ఆరంభం మాత్రమేనని, జిల్లావ్యాప్తంగా ఇదే తరహా చర్యలు కొనసాగితేనే సామాన్యులకు నిజమైన ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.




