Gudipeta: గుడిపేట 13వ బెటాలియన్‌లో ‘యువ ఆపదమిత్ర’ శిక్షణ!
Gudipeta: మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్‌లో ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో 102 మంది విద్యార్థులకు 'యువ ఆపదమిత్ర' విపత్తు నిర్వహణ శిక్షణను కమాండెంట్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
Gudipeta: గుడిపేట 13వ బెటాలియన్‌లో ‘యువ ఆపదమిత్ర’ శిక్షణ!
గుడిపేట: విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంలో యువత కీలక పాత్ర పోషించాలని టీజీఎస్పీ 13వ బెటాలియన్ కమాండెంట్ కె. వెంకటేశ్వర్లు అన్నారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని టీజీఎస్పీ 13వ బెటాలియన్ ప్రాంగణంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘యువ ఆపదమిత్ర’ రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో కరీంనగర్‌కు చెందిన కళాశాల విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొనే విద్యార్థులకు కమాండెంట్ ప్రత్యేక శిక్షణ కిట్ బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, భవనాలు కూలడం వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులను రక్షించేందుకు యువతకు తగిన నైపుణ్యాలు అవసరమన్నారు. విపత్తులకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాద సమయంలో స్పందించాల్సిన విధానాలపై అవగాహన కలిగి ఉంటే భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు సమాజ సేవ పట్ల బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
102 మంది విద్యార్థులకు శిక్షణ
ఈ శిక్షణ శిబిరంలో మొత్తం 102 మంది విద్యార్థులు పాల్గొంటుండగా, వారిలో 66 మంది బాలురు, 36 మంది బాలికలు ఉన్నారు. SDRF మాస్టర్ ట్రైనర్లు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వివిధ అంశాలపై శిక్షణ అందించనున్నారు.
వరదల సమయంలో బాధితులను రక్షించడం, లైఫ్ జాకెట్లు, బోట్ల వినియోగం, అగ్ని ప్రమాదాల నియంత్రణ, అగ్నిమాపక పరికరాల నిర్వహణ, భవనాలు కూలినప్పుడు క్షతగాత్రులను సురక్షితంగా వెలికితీయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా ప్రాథమిక చికిత్స, సీపీఆర్ (CPR), రక్తస్రావాన్ని నియంత్రించే పద్ధతులు, స్ట్రెచర్ల వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నాగభూషణం, ఆంజనేయ రెడ్డి, వీర రాజు, యూనిట్ మెడికల్ డాక్టర్ సంతోష్ సింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గౌస్ మొహియుద్దీన్, SDRF రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం. అశోక్, బెటాలియన్ అధికారులు, SDRF శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.




