Mancherial: గోదావరి పుష్కరాలు 2027: నవంబర్ 14లోగా బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి చేయాలి
Mancherial: గోదావరి పుష్కరాలు 2027 బడ్జెట్ ప్రతిపాదనలను నవంబర్ 14లోగా సమర్పించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. పట్టణంలో బియ్యం కౌంటర్లను ప్రారంభించారు.
Mancherial: గోదావరి పుష్కరాలు 2027: నవంబర్ 14లోగా బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి చేయాలి
మంచిర్యాల: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఖచ్చితమైన అంచనాలతో, పూర్తి వివరాలతో సిద్ధం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిర్వహణ, భూసేకరణ, విద్యుత్ ఛార్జీలు, సాగునీటి శాఖకు సంబంధించిన అవసరాలపై సమగ్ర బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రతి పనికి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంచనాలు రూపొందించాలని, తక్కువ మొత్తంతో ప్రతిపాదనలు పంపించి తర్వాత అదనపు నిధుల కోసం ఇబ్బందులు పడవద్దని స్పష్టం చేశారు.
బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏ ఒక్క పని కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన నిధుల కేటాయింపులు, ప్రొవిజన్ల వివరాలను మరోసారి పరిశీలించి వెంటనే సమర్పించాలని తెలిపారు. భూసేకరణకు సంబంధించి భూమి విస్తీర్ణం, ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా అంచనాలు రూపొందించాలని సూచించారు. ప్రతిపాదనల్లో అవసరమైన అంశాలు లేకపోతే సంబంధిత శాఖల నోడల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చెన్నూర్ గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటికే ఎడమవైపు ఘాట్‌కు మంజూరైన పనులు, మరమ్మతులతో పాటు కుడివైపు ఘాట్‌కు అవసరమైన సదుపాయాలను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
ఘాట్ల భద్రత, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాలని సూచించారు. పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి ఘాట్లు సురక్షితంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని శాఖల బడ్జెట్ ప్రతిపాదనల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభం
అనంతరం మంచిర్యాల పట్టణంలో బాలాజీ ట్రేడర్స్, రవీందర్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయించాలని సూచించారు.
26 కిలోల బియ్యం బస్తాల ధరలను ఈ విధంగా నిర్ణయించారు.
* బీపీటీ పచ్చి బియ్యం – రూ.1,352
* బీపీటీ స్టీమ్ బియ్యం – రూ.1,560
* హెచ్‌ఎంటీ స్టీమ్ బియ్యం – రూ.1,898
* జైశ్రీరామ్ బియ్యం – రూ.2,028
నిర్దేశించిన ధరలకు అనుగుణంగా నిబంధనల ప్రకారం విక్రయాలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, మంచిర్యాల తహసీల్దార్ రఫతుల్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




