Kagaznagar: పేదలకు అండగా ఉచిత కట్టెల సరఫరా.. మాజీ ఎమ్మెల్యే కోనప్ప!
Kagaznagar: కాగజ్‌నగర్‌లో నిరుపేద కుటుంబాల దహన సంస్కారాల కోసం ఉచిత కట్టెల పంపిణీని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. పంటలకు నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Kagaznagar: పేదలకు అండగా ఉచిత కట్టెల సరఫరా.. మాజీ ఎమ్మెల్యే కోనప్ప!
కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్: నిరుపేద కుటుంబాలు దహన సంస్కారాల సమయంలో కట్టెలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి ఉచితంగా కట్టెలు అందించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.
సిర్పూర్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు గతేడాది కౌటాలలో ఉచిత కట్టెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. తాజాగా కార్యక్రమం ప్రారంభించి 16 నెలలు పూర్తయిన సందర్భంగా కాగజ్‌నగర్‌లోనూ ఉచిత కట్టెల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆపద సమయంలో నిరుపేద కుటుంబాలకు ఈ కార్యక్రమం కొంతమేర ఆర్థిక భారం తగ్గిస్తుందని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రస్తుత పంట కాలంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోనప్ప తెలిపారు. పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వ్యవసాయానికి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ కోతలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.




