Mancherial: జరిమానా చెల్లించలేదని గిరిజనుడిపై ఫారెస్ట్ అధికారి దాడి!
Mancherial: నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన గిరిజనుడు ముత్తయ్యపై జరిమానా చెల్లించలేదంటూ డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ నాయక్ దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి.
Mancherial: జరిమానా చెల్లించలేదని గిరిజనుడిపై ఫారెస్ట్ అధికారి దాడి!
Mancherial: అటవీ శాఖ అధికారులు విధించిన రూ.30 వేల జరిమానా చెల్లించలేదనే కారణంతో ఓ గిరిజనుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బాగాల ముత్తయ్య అనే గిరిజనుడు (ఎస్టీ) తనపై డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ నాయక్ దాడి చేసినట్లు ఆరోపించారు.
జోగాపూర్ నుంచి పంది మాంసం తెచ్చుకున్నావనే ఆరోపణతో ఎలాంటి ఆధారాలు చూపకుండా తనకు రూ.30 వేల జరిమానా విధించారని ముత్తయ్య తెలిపారు. తన వద్ద ప్రస్తుతం రూ.10 వేలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన రూ.20 వేలు మరుసటి రోజు చెల్లిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.
అయినప్పటికీ ఉదయం నుంచి ఫారెస్ట్ కార్యాలయానికి ఎందుకు రాలేదంటూ కార్యాలయంలోకి తీసుకెళ్లి బల్లపై పడుకోబెట్టి లాఠీతో కొట్టినట్లు ఆరోపించారు. డబ్బులు వెంటనే చెల్లించాలని బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమలాంటి గిరిజనులు రూ.30 వేల జరిమానా ఎలా చెల్లించగలరని ముత్తయ్య ప్రశ్నించారు. తనను కొట్టవద్దని కాళ్లు మొక్కి వేడుకున్నా కనికరించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. తనకు రక్షణ కల్పించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తనకు న్యాయం జరగకపోతే ఫారెస్ట్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ, తన చావుకు డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ నాయక్ కారణమవుతారని పేర్కొంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కూలి పనులు చేసుకుంటూ బతికే గిరిజన కుటుంబాలకు భారీ జరిమానాలు విధిస్తే వాటిని ఎలా భరించగలరనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.




