Mancherial: రబీ సాగు ప్రణాళిక, విద్య, భూసేకరణపై ప్రత్యేక దృష్టి: సీఎస్

Mancherial: రబీ సాగు ప్రణాళిక, పాఠశాలల హాజరు, జాతీయ రహదారుల భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణపై సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 13 Nov 2026 8:44 PM IST
Mancherial
X

Mancherial: రబీ సాగు ప్రణాళిక, విద్య, భూసేకరణపై ప్రత్యేక దృష్టి: సీఎస్

మంచిర్యాల: రాబోయే రబీ సీజన్‌కు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు విద్య, భూసేకరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.

రబీ సాగుకు అవసరమైన సాగునీటి సదుపాయాలు కల్పించేందుకు సూక్ష్మ సేద్యం, ఉద్యానవన శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పంటల వైవిధ్యీకరణ, కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. రాయితీ విత్తనాల పంపిణీ, పంటల మార్పిడి, సూక్ష్మ సేద్య పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థుల హాజరు 73.74 శాతం ఉండగా, మంచిర్యాల జిల్లాలో 72.21 శాతంగా నమోదైందని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు రాష్ట్రస్థాయిలో 87.06 శాతం, జిల్లాలో 88.05 శాతంగా ఉందన్నారు. విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు డిజిటల్ లెర్నింగ్ విధానాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకులాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని తెలిపారు.

వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, స్థానిక సంస్థల పరిధిలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.

జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అవార్డుల జారీ, పరిహారం పంపిణీ, భూముల స్వాధీనంలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించాలని ఆదేశించారు. అర్హులైన భూయజమానులకు పరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రబీ సాగులో తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగు, రాయితీ విత్తనాల పంపిణీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థుల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.