Mancherial: సాగునీటి కోసం రైతుల రాస్తారోకో.. కడెం నీటిని విడుదల చేయాలని డిమాండ్!
Mancherial: సాగునీటి కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. పంటలు పూర్తయ్యే వరకు కడెం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Mancherial: సాగునీటి కోసం రైతుల రాస్తారోకో.. కడెం నీటిని విడుదల చేయాలని డిమాండ్!
Mancherial: సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరా నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడెం ప్రధాన రహదారిపై బుధవారం సుమారు 200 మంది రైతులు రాస్తారోకో చేపట్టారు.
వానాకాలం పంటల సాగు ప్రారంభ సమయంలో ఇరిగేషన్ అధికారులు 20 రోజుల ఆలస్యంగా నీటిని విడుదల చేశారని, ఇప్పుడు పంటలు పూర్తికాకముందే నీటి సరఫరా నిలిపివేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు తడుల నీటిని విడుదల చేసి వరి పంటను కాపాడాలని కోరారు. సాగునీటి అవసరాల కోసం నిర్మించిన కడెం ప్రాజెక్టు నీటిని తాగునీటి పొదుపు పేరుతో నిలిపివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి ఆదుకోకపోతే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ వినయ్ మాట్లాడుతూ.. పంటలు కీలక దశలో ఉన్నందున చివరి ఆయకట్టు రైతులకు పంటలు పూర్తయ్యే వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాను నిలిపివేయడం సరికాదని అన్నారు.
సుమారు గంటపాటు రైతుల రాస్తారోకో కొనసాగింది. విషయం తెలుసుకున్న జన్నారం ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు.




