Mancherial: జిల్లాలో బ్యాంకింగ్ సేవలను విస్తరించాలి.. అర్హులందరికీ రుణాలు: కలెక్టర్
Mancherial: మంచిర్యాల జిల్లాలో బ్యాంకింగ్ సేవలు విస్తరించి, పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని, విద్యా రుణాలు వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
Mancherial: జిల్లాలో బ్యాంకింగ్ సేవలను విస్తరించాలి.. అర్హులందరికీ రుణాలు: కలెక్టర్
మంచిర్యాల: జిల్లాలో బ్యాంకింగ్ సేవలను విస్తరించి, బ్యాంకింగ్ సదుపాయాలు లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఆర్థిక సేవలను చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అర్హులైన రైతులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు రుణ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ నటరాజ్, ఆర్బీఐ ఎల్‌డీఓ శ్రీనివాస్ వెన్న, నాబార్డ్ డీడీఎం వీరభద్రుడు, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ తదితరులతో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి, ఇప్పటికే గుర్తించిన 135 ప్రాంతాలతో పాటు మరో 400కు పైగా ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పీవీటీజీ జనాభా నివసించే ప్రాంతాలకు ఆర్థిక సేవలను చేరువ చేయాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆర్థిక సమ్మిళిత బాధ్యతతో పనిచేయాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కల్పించే అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహించాలని సూచించారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అర్హులైన రైతుల పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా పునర్వ్యవస్థీకరించాలని, అవసరమైన వారికి అదనపు రుణ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు, ఇతర స్వల్పకాలిక రుణాల దరఖాస్తులను సానుకూలంగా పరిశీలించాలని తెలిపారు.
రుణాల చెల్లింపుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బ్యాంకర్లు, సెర్ప్, మెప్మా సిబ్బంది సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువస్తే అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
అదేవిధంగా విద్యా రుణాలు కోరే విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. రుణ దరఖాస్తులను తిరస్కరించే సందర్భంలో అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని బ్యాంకు అధికారులకు తెలిపారు.
బ్యాంకులు తమ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని, బిజినెస్ కరస్పాండెంట్ కేంద్రాలను మూసివేయకుండా కొనసాగించడంతో పాటు అవసరమైన చోట కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో వివిధ బ్యాంకుల అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.




