Mancherial: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత.. సూపర్‌వైజర్ జ్యోతి!
Mancherial: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జ్యోతి అన్నారు. బాలికల భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలని కోరారు.
Mancherial: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత.. సూపర్‌వైజర్ జ్యోతి!
Mancherial: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జ్యోతి అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, మానసిక వికాసం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్ సెక్టార్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్-3 అంగన్‌వాడీ కేంద్రంలో సీడీపీఓతో కలిసి బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ బాలికలకు చిన్న వయసులోనే వివాహాలు చేయడం వల్ల వారి చదువు మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా చోటుచేసుకుంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
సీడీపీఓ మాట్లాడుతూ బాలికలకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, భద్రతతో పాటు సమాన హక్కులు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు, ప్రజలు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీపీఎస్ సిబ్బంది సత్యయ్య, ప్రేమ్, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




