Mancherial: విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు.. కలెక్టర్!
Mancherial: లక్షెట్టిపేటలో గురుకులాల వార్షిక క్రీడా దినోత్సవంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు.
Mancherial: విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు.. కలెక్టర్!
Mancherial: విద్యతోనే వ్యక్తులు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం లక్షెట్టిపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా గురుకులాల వార్షిక క్రీడా దినోత్సవానికి ఆర్‌సీఓ శ్రీధర్‌తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి విద్యే అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. విద్య ద్వారా జ్ఞానం, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు, మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు తమకు లభిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత
ప్రభుత్వం విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
ఒక్కో పాఠశాలను సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఒక్కో పాఠశాలలో 2,600 మంది చొప్పున మొత్తం 7,800 మంది విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం తాత్కాలిక, అద్దె భవనాల్లో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలకు నూతన భవనాల కేటాయింపులో ప్రాధాన్యతనిస్తూ మెరుగైన తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు
విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి, సమన్వయం, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు.
పోటీల్లో గెలుపోటముల కంటే నిబద్ధతతో పాల్గొనడం, నిరంతరం సాధన చేయడం ముఖ్యమన్నారు. మార్చ్‌ఫాస్ట్‌లో విద్యార్థులు సమన్వయంతో ఒకే విధంగా అడుగులు వేయడం వారి క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగ ఎంపికలు, పోటీ పరీక్షలు, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు పొందాలన్నా క్రమశిక్షణ, చురుకుదనం, నేర్చుకోవాలనే ఆసక్తి, అంకితభావం అవసరమని వివరించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ నెల 16వ తేదీ వరకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు కొనసాగనున్నట్లు తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయంలో పథకాలపై సమీక్ష
అనంతరం లక్షెట్టిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి డిప్యూటీ తహసీల్దార్ శ్రావణితో కలిసి వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
జీఓ నంబర్లు 76, 58, 59 కింద వచ్చిన దరఖాస్తులు, భూభారతి కార్యక్రమం, భూముల రీ-సర్వే, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పురోగతిని పరిశీలించారు. జీఓ 58, 59 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందించాలని ఆదేశించారు.
భూభారతి కింద వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, రీ-సర్వే పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.
భూ రికార్డుల నిర్వహణలో తప్పులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు త్వరగా లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




