Mancherial: మట్టి ప్రమిదలకు తగ్గిన ఆదరణ.. కుమ్మరి కుటుంబాల్లో ఆందోళన!
Mancherial: ఎలక్ట్రానిక్ దీపాల వైపు జనం మొగ్గు చూపడంతో మంచిర్యాల, కుమ్రం భీమ్ జిల్లాల్లో మట్టి ప్రమిదలకు గిరాకీ తగ్గి కుమ్మరి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి.
Mancherial: మట్టి ప్రమిదలకు తగ్గిన ఆదరణ.. కుమ్మరి కుటుంబాల్లో ఆందోళన!
మంచిర్యాల: దీపావళి అంటేనే మట్టి ప్రమిదల వెలుగులు.. సంప్రదాయంగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రజల అభిరుచులు మారుతుండటంతో సంప్రదాయ మట్టి ప్రమిదలకు ఆదరణ తగ్గుతోంది. మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల్లో కుమ్మరి కులస్తులు తయారు చేస్తున్న మట్టి ప్రమిదలకు మార్కెట్లో గిరాకీ లేకుండా పోతోంది. ప్రజలు రంగురంగుల ఎలక్ట్రానిక్ దీపాల వైపు మొగ్గు చూపుతుండటంతో కుమ్మరి కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతోంది.
మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాల నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం విద్యుత్‌తో పనిచేసే ఎలక్ట్రానిక్ అలంకరణ దీపాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంప్రదాయ మట్టి ప్రమిదలను పక్కనపెట్టి విద్యుత్ దీపాలకు ప్రాధాన్యత ఇవ్వడం విరుద్ధ పరిస్థితులకు దారితీస్తోంది.
గత ఏడాది తయారు చేసిన మట్టి ప్రమిదలను సైతం ఈ ఏడాది మళ్లీ విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కుమ్మరి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మార్కెట్లో అమ్మకాలు తగ్గడంతో తయారు చేసిన ప్రమిదలు నిల్వ ఉండిపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న తమకు ఆదరణ కరువవుతోందని వాపోతున్నారు.
మరోవైపు పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రమిదల వినియోగం ఎంతో మేలు చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రానిక్ అలంకరణ దీపాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి ప్రమిదలను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మన సంప్రదాయాన్ని కాపాడటంతో పాటు కుమ్మరి కుటుంబాల జీవనోపాధికి అండగా నిలవాలంటే ప్రతి ఒక్కరూ మట్టి ప్రమిదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. మన ఇంట్లో దీపాలు వెలిగించడంతో పాటు.. మట్టి ప్రమిదలు తయారు చేసే కుటుంబాల్లోనూ దీపావళి వెలుగులు నింపాలని కోరుతున్నారు.




