Mancherial: అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు: మేయర్ మధుకర్
Mancherial: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 10వ డివిజన్లలో అర్హులైన లబ్ధిదారులకు మేయర్ దర్ని మధుకర్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
Mancherial: అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు: మేయర్ మధుకర్
మంచిర్యాల: అర్హులైన ప్రతి కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డులు అందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2, 10వ డివిజన్లలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మేయర్ దర్ని మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందాలంటే రేషన్ కార్డు కీలకమని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ రేషన్ కార్డులను అందించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని మేయర్ వివరించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, ఎండీ ఖలీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




