Kasipeta: కాసిపేటను కరువు మండలంగా ప్రకటించాలి: బీఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక
Kasipeta: కాసిపేటను తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Kasipeta: కాసిపేటను కరువు మండలంగా ప్రకటించాలి: బీఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక
కాసిపేట: కాసిపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్ భవనంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు.
కాసిపేట మండలం ఏజెన్సీ ప్రాంత పరిధిలో ఉండటంతో పాటు అధిక సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్నారని, ఇలాంటి ప్రాంతాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం సరికాదని పేర్కొన్నారు. కరువు మండలాల ఎంపికకు ప్రభుత్వం అనుసరించిన ప్రమాణాలేమిటో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా 11 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని తెలిపారు.
అయితే బెల్లంపల్లి నియోజకవర్గంలో నెన్నెల, వేమనపల్లి మండలాలను మాత్రమే ఎంపిక చేశారని, కాసిపేటతో పాటు మిగిలిన మండలాలను విస్మరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే స్పందించి, మండలానికి జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కాసిపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, బెల్లంపల్లి నియోజకవర్గంలోని అర్హత కలిగిన అన్ని మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ కాసిపేట మేజర్ పంచాయతీ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, బీఆర్ఎస్ మండల కార్యదర్శి మోటూరి వేణు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటెంకి వాసుదేవ్, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రామచందర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, నాయకులు లంక లక్ష్మణ్, జాడి రామచందర్, అచ్యుత్ రావు, గోమాస సుధాకర్, దుర్గం రవి, నిచ్చకొల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.




