Mancherial: బెల్లంపల్లిలో డెత్ సర్టిఫికెట్ల కలకలం.. రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు!
Mancherial: బెల్లంపల్లిలో డెత్ సర్టిఫికెట్ల అక్రమ జారీపై వివాదం చెలరేగింది. రాజకీయ ఒత్తిళ్లతోనే సర్టిఫికెట్లు ఇచ్చామంటూ సిబ్బంది, కారోబార్లు ఆరోపించారు.
Mancherial: బెల్లంపల్లిలో డెత్ సర్టిఫికెట్ల కలకలం.. రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు!
Mancherial: బెల్లంపల్లి మండలంలో డెత్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మంచిర్యాల జిల్లాకు చెందిన వారు కాకుండా ఇతర జిల్లాల్లో మరణించిన వ్యక్తుల పేర్లతోనూ బెల్లంపల్లి మండలంలో మరణ ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒక్కో సర్టిఫికెట్ కోసం రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ వ్యవహారం వెనుక భారీ అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సర్టిఫికెట్లను ప్రధానంగా భూముల బదలాయింపుల కోసం ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూముల లావాదేవీల్లో మరణ ధ్రువీకరణ పత్రాలకు కీలకంగా ఉండటంతో, వాటి కోసం భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ అండదండలతోనే సాగిందని, కొందరు నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి సర్టిఫికెట్లు జారీ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కుంభకోణంపై ఎంపీఓ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో నలుగురు పంచాయతీ కార్యదర్శులతో పాటు ఓ కంప్యూటర్ ఆపరేటర్పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
నిబంధనల ప్రకారం అధికారుల ప్రమేయం లేకుండా మరణ ధ్రువీకరణ పత్రాల జారీ సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం విచారణ మాత్రం కొందరు ఉద్యోగులకే పరిమితమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు.
మరోవైపు, ఈ వ్యవహారంలో తమను బలిపశువులుగా చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే సర్టిఫికెట్లు జారీ చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు తమపై కేసులు నమోదు చేసి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ పేరుతో గత మూడు రోజులుగా తల్లగురిజాల ఎస్సై ప్రశాంత్ తమను పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని, అధికార పార్టీ నాయకుల పేర్లు వెల్లడించవద్దంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని కారోబార్లు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కుంభకోణానికి కారణమైన రాజకీయ నాయకుల పాత్రపై కూడా విచారణ జరపాలని, డబ్బులు తీసుకుని అక్రమంగా సర్టిఫికెట్లు జారీ చేయించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి అక్రమ మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి అడ్డుకట్ట వేయాలని, భూముల బదలాయింపుల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




