Mancherial: అర్ధరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు.. గంజాయి వినియోగదారులకు కౌన్సెలింగ్!
Mancherial: మంచిర్యాలలో గంజాయి కట్టడికి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గంజాయి వినియోగదారుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Mancherial: అర్ధరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు.. గంజాయి వినియోగదారులకు కౌన్సెలింగ్!
Mancherial: మంచిర్యాల జిల్లా లో గంజాయి వినియోగం, సరఫరాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం అర్ధరాత్రి మంచిర్యాల పట్టణంలోని వడ్డెర కాలనీ, వికాస్ నగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గతంలో గంజాయి సేవించడం, సరఫరా చేయడం వంటి కేసుల్లో నిందితులుగా ఉన్న యువకుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి పరిస్థితిని పరిశీలించారు. యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించి గంజాయి వినియోగం వల్ల కలిగే అనారోగ్య, కుటుంబ, సామాజిక సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొద్దిపాటి డబ్బుల కోసం గంజాయిని సరఫరా చేస్తూ ఇతరుల జీవితాలను నాశనం చేయడం సరికాదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి యువతకు విక్రయించే వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొదటిసారి గంజాయి వినియోగానికి పాల్పడిన యువకుల్లో మార్పు తీసుకురావడానికి పోలీస్ శాఖ తరఫున కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, అవసరమైన వారికి డీ-అడిక్షన్ సహాయం అందిస్తామని తెలిపారు. అయితే గంజాయి సరఫరా చేస్తూ యువతను వ్యసనాలకు ప్రోత్సహించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
గంజాయి మత్తులో రోడ్లపై గొడవలు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడమే కాకుండా చిన్నారులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఉపాధి, నైపుణ్య శిక్షణ, డీ-అడిక్షన్ వంటి అవసరాల్లో పోలీస్ శాఖ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
జిల్లావ్యాప్తంగా గంజాయి వినియోగం, సరఫరాపై నిరంతర నిఘా కొనసాగించాలని, సరఫరా మూలాలను గుర్తించి పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను సీపీ ఆదేశించారు.
ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, పట్టణ ఎస్సైలు ఆది మధుసూదన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.




