Mancherial: కార్తీక పౌర్ణమికి గూడెం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కలెక్టర్ తనిఖీ
Mancherial: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Mancherial: కార్తీక పౌర్ణమికి గూడెం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కలెక్టర్ తనిఖీ
Mancherial: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంగుట్టలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు, దేవాదాయ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, పార్కింగ్ సదుపాయాలతో పాటు ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ, క్యూలైన్ల నిర్వహణ, పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ప్రతి సంవత్సరం ఈ పుణ్యక్షేత్రాన్ని లక్ష మందికి పైగా భక్తులు సందర్శిస్తున్నారని, భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శాంతి, సామరస్యం, సుఖసంతోషాలు, సర్వతోముఖాభివృద్ధి కలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




