Mancherial: ఫాంహౌస్ పార్టీ పోలీసులపై వేటు.. కేసీఆర్‌ను ఏం చేయాలి?: సీఎం

Mancherial: ఫామ్‌హౌస్‌లో గంటసేపు పార్టీ చేసుకున్న బెల్లంపల్లి పోలీసులపై చర్యలు తీసుకుంటే.. మూడేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ను ఏం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 20 Nov 2026 9:19 AM IST
Mancherial
X

Mancherial: ఫాంహౌస్ పార్టీ పోలీసులపై వేటు.. కేసీఆర్‌ను ఏం చేయాలి?: సీఎం

మంచిర్యాల: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఫామ్‌హౌస్ పార్టీ ఘటనను ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విధుల్లో ఉండి గంటసేపు పార్టీ చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకుంటే.. ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌ను ఏం చేయాలని ప్రశ్నించారు.

బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు రికార్డుల్లో సంతకాలు చేసి, ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ చేసుకున్న ఘటనపై సీఎం స్పందించారు. విధులకు డుమ్మా కొట్టి పార్టీలు, డ్యాన్స్‌లకు వెళ్లిన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సరైనదేనని సమర్థించారు. పోలీసుల విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారని విమర్శించారు. ఒక్క గంట పార్టీ చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకుంటే.. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మూడేళ్లుగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్న కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

పోలీసులపై చర్యలు.. సీఎం వ్యాఖ్యలకు పొంతన లేదా?

బెల్లంపల్లి పోలీసుల ఫామ్‌హౌస్ పార్టీ ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐదుగురు సిబ్బందిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన విచారణ, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే పార్టీలో పాల్గొన్న సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడలేదు. కేవలం అటాచ్‌మెంట్, శాఖాపరమైన విచారణకే పరిమితం చేశారు.

మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడినట్లు వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ బాధ్యతలు కూడా ఉన్న నేపథ్యంలో.. పోలీసులపై వాస్తవంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సస్పెన్షన్ జరిగిందా? లేక అటాచ్‌మెంట్, విచారణతోనే సరిపెట్టారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పార్టీలో పాల్గొన్న పోలీసులపై సస్పెన్షన్ విధించకుండా కేవలం బదిలీ, విచారణకే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడితో కఠిన చర్యలు నిలిచిపోయాయనే ప్రచారం కూడా సాగుతోంది. పోలీసులపై చర్యలు తీసుకునే విషయంలో పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు పోలీసులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు సీఎం వ్యాఖ్యలు.. మరోవైపు అధికారికంగా సస్పెన్షన్ కాకుండా అటాచ్‌మెంట్, విచారణ మాత్రమే చేపట్టినట్లు సమాచారం ఉండటంతో ఈ వ్యవహారం పోలీసు శాఖలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.